ఏపీ సీఎం జగన్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగిందని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. పోలవరం నిర్వాసితులను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందించకపోగా.. లబ్ధిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. పోలవరం(Polavaram Project) పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని జగన్(YS Jagan)ను ప్రశ్నించారు.
పోలవరం(Polavaram) నిర్వాసితులకు ఇచ్చిన హామీపై సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరుగుతూ ఎదురుదాడి చేయటం జాతి ద్రోహమేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయని, గోదావరి డెల్టా ఆధునికరణ 5 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పోలవరంతో పాటు చింతలపూడి లిఫ్ట్ పూర్తై ఉంటే రాష్ట్రం సుభిక్షమయ్యేదన్నారు. ఈ ప్రభుత్వం రావడంతో చెప్పలేనంత నష్టం జరిగిందని.. పోలవరం ఒక చరిత్ర.. ఒక కల.. అని పేర్కొన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ(Vizag) నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ దానిని ఆటకెక్కించిందని మండిపడ్డారు.
ఓ మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ అన్నారు. ఎన్ని తప్పులైనా చేసి ఎదురుదాడి చేస్తే భయపడి మౌనంగా ఉంటామా? అని ప్రశ్నించారు. కొంతమంది సిగ్గులేకుండా విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మేధావులు అని చెప్పుకునేవారు ఇప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా? లేక ఇంకా అథఃపాతాళానికి నెట్టేస్తారో ఆలోచించుకోవాలని చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు.