సీఎం జగన్(YS Jagan)పై రాయితో దాడి చేసిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఘటన గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయి వేసిన వ్యక్తి గురించి చెబితే రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 సమాచారం ఇవ్వాలని కోరారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం(సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామన్నారు.
ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ వేశారు. దీంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు.
విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో ఆయన మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని.. మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. తనను ఎలాంటి దాడులు ఆపలేవని.. ధైర్యంతో ముందడుగు వేద్దామని పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నాయని జగన్ వెల్లడించారు. కాగా శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్(YS Jagan)పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే.