అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో ఏ అభివృద్ధి జరగలేదని.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తన హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అమరావతిలోని అమరాలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఇవాళ ఉదయం చర్చకు రావాలని ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు.
దీంతో పోలీసులు అమరావతిలో 144సెక్షన్ విధించారు. ఉదయం నుంచే పోలీసులు ఆలయం చుట్టుపక్కల భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులు దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొమ్మాలపాటి శ్రీధర్ తో సహా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.