ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాబుకు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
పార్టీలో దళితులకు విలువ లేదని.. చాలా చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ చెప్పినట్లుగానే తాను పనిచేశానని.. అయినా కానీ తనను పక్కన పెట్టారని వాపోయారు. కేవలం దళితులను మాత్రమే మారుస్తున్నారని.. రెడ్లను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి చెప్పినవారినే అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తంచేయడంతో కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి MS Babu కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇప్పటికే నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, యర్రగొండపాలెం టీడీపీ నాయకురాలు బూడిద అజితారావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.