రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, రాబోయే ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు.
బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా 75 ఏళ్లుగా అన్యాయం చేస్తున్నారన్నారు. జెండాలు మోసుకుంటూ, జిందాబాద్‌ల నినాదాలు ఇస్తూ బీసీలను వాడుకుంటున్నారని విమర్శించారు.
బీసీ జన గణన చేయాలని, బీసీలకు రిజర్వేషన్లను(Reservations) పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలనే అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన(R Krishnaiah) చెప్పారు. ఈ విషయంలో పార్లమెంట్‌లో నిలదీస్తామని స్పష్టం చేశారు. దేశ బడ్జెట్‌లో బీసీ నిధులు సద్వినియోగం చేయకపోవడం వల్ల మిగిలిపోతున్నాయన్నారు.