ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు కేటాయించారు. అయితే పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ శ్రీనివాస్ వర్మకు బీజేపీ ఇచ్చింది. దీంతో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించిన రఘురామకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరడంతో ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు పెదఅమిరం గ్రామంలోని తన నివాసం నుంచి రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishnam Raju) భారీ ర్యాలీగా ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోలాహలం నెలకొంది. మెడలో టీడీపీ కండువా, తలకు ఎర్రగుడ్డ, కళ్లకు సన్ గ్లాసులు ధరించి రఘురామ ర్యాలీలో ఉత్సాహంగా కనిపించారు.