ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయం పిఠాపురంలో అగ్గి రాజేసింది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కోసం ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి(SVSN Varma) ఎమ్మెల్సీ టికెట్ లభిస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. అయితే ఆయనకి టిడిపి అధిష్ఠానం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, వర్మ అభిమానులు భగ్గుమన్నారు. పిఠాపురం(Pithapuram) పార్టీ ఆఫీసు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వర్మ(SVSN Varma) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. కార్యకర్తలకు, అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) పడే కష్టాన్ని మనందరం గుర్తించాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వర్మ సూచించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో 23 ఏళ్లుగా బంధం ఉందని ఆయన గుర్తుచేశారు. ఇది ఇలాగే కొనసాగిస్తామని వర్మ తెలియజేసారు. ప్రజలకు సేవ చేయడమే గొప్ప పదవిగా భావిస్తున్నానని వర్మ అన్నారు. గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం చేసి వారి గౌరవాన్ని, తెలుగుదేశం ప్రతిష్టను ను పిఠాపురం టీడీపీ నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి, చంద్రబాబు, లోకేష్(Nara Lokesh) లకు అండగా ఉంటూ.. అలాగే పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పని చేస్తామని వర్మ చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం కలగకుండా చూసుకుంటూ పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక ఇదే విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్( Nadendla Manohar) స్పందిస్తూ.. వర్మ చాలా సీనియర్ నాయకులని అన్నారు. జనసేన ఎప్పటికి వర్మను గౌరవిస్తుందని అన్నారు. పదవులు కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత విషయమని ఆయన తెలియజేసారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్తూ.. ఈ నియోజకవర్గంలో ఎవరికీ చెక్ పెట్టాల్సిన పని లేదని, అలా ఉండదని తెలిపారు.