TDP Leaders Meet DIG Over Macherla incident: ఏపీ పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణతో రాష్ట్రం అట్టుడుకుతోంది. మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయలవగా, టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు.
ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. వైసీపీ రౌడీయిజం చేస్తోందని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో టీడీపీ నేతలపై కేసులు పెట్టడంపై పోలీసులను విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు నగరంలో DIG ని కలిశారు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేతలను అర్జంటుగా అరెస్టు చేయాలని పోలీసులు ఉత్సాహంగా ఉన్నారని ఆరోపించారు. మేం అడిగిన ప్రశ్నలకు డీఐజీ సమాధానం చెప్పలేకపోయారని వెల్లడించారు.
మాచర్లలో ఫ్యాక్షన్ ఉందని డీఐజీ చెబుతున్నారు. ఇప్పుడు ఉండేది ఫ్యాక్షన్ కాదు రౌడీయిజం అని చెప్పాము. కేవలం డీఐజీ సమర్థించుకోవటానికి చూస్తున్నారు. మా పార్టీ వారిని పరామర్శించేందుకు వెళ్తామని చెప్పాం. మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలపై, అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణమని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపిన టిడిపి శ్రేణుల ఇల్లు తగలబెడతారా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి మాచర్ల ఘటన(macherla incident)తో మరోసారి రుజువయింది. ప్రశాంత రాష్ట్రంలో నెత్తుటి రాజకీయం చేయాలనుకుంటున్నారు. మాచర్ల ఘటన రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలకు నిలువెత్తు నిదర్శనం అని డీఐజీకి చెప్పామని టీడీపీ నేతలు వెల్లడించారు.