Chebrolu Kiran – YS Bharathi | ఆడవారిపై, రాజకీయ నేతల కుటుంబ సభ్యులపై, చిన్నపిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే పార్టీలకి అతీతంగా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చెప్పినట్టే హద్దు మీరి ప్రవర్తిస్తే సొంత కార్యకర్తలపైనా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం లేదు. తాజాగా, YS భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదన్న టీడీపీ(TDP) అధిష్టానం… కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రభుత్వం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో పోలీసులు గుంటూరులో కిరణ్ ను అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని.. కిరణ్ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
కాగా, ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran).. పోలీసులను బట్టలూడదీసి తంతాం అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జగన్ కి అంత సీన్ ఉంటే భారతి వైఎస్ అవినాష్ రెడ్డితో మూడు గంటలు ఫోన్ లో ఎందుకు మాట్లాడుతుంది, పిల్లలకు అంత హైట్ ఎలా వస్తుంది అంటూ.. భారతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కిరణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం సొంత కార్యకర్త అయినప్పటికీ కిరణ్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమై.. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, పోలీసు సైతం కేసుకి ఆదేశాలు జారీ చేసింది.