టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈనెల 22వరకు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పుతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు రాజమండ్రి జైలు వద్ద పోలీసులు భారీ బందోసబస్తు ఏర్పాటుచేశారు. బాబు రిమాండ్ నేపథ్యంలో రేపు ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
ఏడున్నర గంటల పాటు వాడివేడిగా వాదనలు జరిగాయి. రిమాండ్ విధించాలంటూ సీఐడీ తరపు లాయర్లు వాదించగా.. రిమాండ్ రిపొర్టు కొట్టేయాలని కోరిన చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. అరెస్ట్ ప్రోసిజర్ తప్పన్న సీనియర్ లాయర్ లూథ్రా(Sidharth Luthra) తన వాదన వినిపించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమన్న లూథ్రా తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీ కోరుతున్నారని..జ్యూడిషియల్ కస్టడీలో విచారించేదేముందని ప్రశ్నించారు. చంద్రబాబు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐడీ తరపు లాయర్లు, చంద్రబాబు తరపు లాయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Skill Development Case | అంతకుందుకు చంద్రబాబు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని.. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించామని.. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని వాదించారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని వెల్లడించారు.