శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్‌డేట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి వినియోగంతో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూనే.. దేవస్థానం ప్రసాద పవిత్రకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామని టీటీడీ తమ అధికారిక (ఎక్స్) వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగానే గతంలో వినియోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. దీంతో పాటుగానే గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యి కల్తీ అయిందని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్ట్‌లను కూడా టీటీడీ షేర్ చేసుకుంది. శ్రీవారి ప్రసాద పవిత్ర విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్న తమ అంకితభావాన్ని, లడ్డూ నాణ్యత విషయంలో భక్తులకు ఒక క్లారిటీ ఇవ్వడానికి టీటీడీ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్తుంది.
కాగా శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాద నాణ్యత అంశం కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీటీడీలో వినియోగించిన నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని టీడీపీ వారు ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను చూపిస్తుంటే.. వైసీపీ మాత్రం అలా జరిగే ప్రసక్తే లేదని, వచ్చే ప్రతి సరుకులను కూడా టీటీడీ పరీక్షించిన తర్వాతే అనుమతిస్తుందని, కల్తీ ఉంటే వెంటనే వెనక్కు పంపుతుందని గుర్తు చేస్తోంది. తమ హయాంలో దాదాపు 18సార్లు వచ్చిన ముడిసరుకును వెనక్కు పంపినట్లు మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ వెల్లడించారు.