ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్ కలిశారు. ఈ సందర్బంగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి ఉన్న మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలను వ్యక్తిగత ఖాతాల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమను తొలగించాలంటూ టీడీపీ(TDP) కార్పొరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి వినతిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ఒక్క ఆశావర్కర్(Asha Workers)ను కూడా ఉద్యోగం నుంచి తీసేయడం జరగదని హామీ ఇచ్చారు. వారి కాల పరిమితి దాటినా సరే వారు ఆశావర్కర్లగానే కొనసాగుతారని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కండువాలు వేసుకుని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నామంటే అందుకు పీడీ బాపూ నాయుడు ఒత్తిడే కారణమని చెప్పారు. యూసీడీ మొత్తాన్ని ఆయన వైసీపీ యంత్రాంగంగా మార్చేశారని చెప్పారు. అదే విధంగా ఇకపై తమను రాజకీయాల్లోకి లాగొద్దని, ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని వేడుకున్నారు. వారికి అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్(Nara Lokesh) భరోసా ఇచ్చారు.