వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై బుధవారం తీర్పు ప్రకటిస్తానన్న హైకోర్టు అప్పటివరకు ఆయనను అరెస్ట్ చెయ్యవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ముందు సీబీఐ తరపు న్యాయవాది దాదాపు మూడున్నర గంటలపాటు వాదనలు వినిపించారు. వివేకానంద హత్య కేసులో విచారణకు అవినాష్ రెడ్డి సహకరించటం లేదన్నారు. ఎప్పుడు నోటీసు ఇచ్చినా మూడు నుంచి నాలుగు రోజుల సమయం అడుగుతున్నారని చెప్పారు. ఏప్రిల్ 17, మే 15న నోటీసులు ఇస్తే కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణకు రాలేదన్నారు. మిగతా ఆరుగురు నిందితులు విచారణకు హాజరైనట్టు చెప్పారు.
అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన తల్లి ఆరోగ్యం బాగా లేనందునే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదని చెప్పారు. నిజానికి సీబీఐ ఆఫీస్ కు వస్తుండగా తన తల్లి ఆరోగ్యం దెబ్బ తిన్న విషయం తెలిసి అవినాష్ రెడ్డి దారిలో నుంచి వెనుతిరిగినట్టు వివరించారు. అంతకుముందు అవినాష్ రెడ్డి(Avinash Reddy) పిలిచిన ప్రతీసారి సీబీఐ విచారణకు హాజరైనట్టు తెలిపారు. ఆ సమయంలో కోర్టు బుధవారం వరకు ఆగగలరా? అని సీబీఐ తరపు న్యాయవాదిని అడిగారు. అభ్యంతరం లేదని సీబీఐ న్యాయవాది చెప్పగా బుధవారం తీర్పు చెప్తామన్న కోర్టు అప్పటివరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.