ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రామచంద్రయ్య టీడీపీలో చేరగా.. వంశీకృష్ణ జనసేనలో చేరారు. దీంతో ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్, మండలి కార్యదర్శికి మండలి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఇటీవల పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం విధితమే. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు తెలిపిన ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.