ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. రెండు మూడేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ సందర్భంగానే ఏపీకి కొత్త నిర్వచనం చెప్పారు.
‘‘ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం. ఈ రెండు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా వీటిని పూర్తి చేయడానికి పూర్తి సహకారం అందిస్తుంది. అమరావతికి రూ.2500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. రూ.12 వేల నుంచి రూ.15 వేల కోట్లు విలువైన అమరావతి ఓఆర్ఆర్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూసేకరణ పనులు జరుగుతున్నాయి’’ అని వివరించారు పెమ్మసాని(Pemmasani Chandra Sekhar).