ఏపీ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించారు. ఏపీ మిర్చి రైతుల(Chilli Farmers) సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ అంశంపై కేంద్ర వ్యవశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)తో చర్చించామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu), అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఏపీ మిర్చి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, మిర్చి ఎగుమతులను పెంచడానికి ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన వివరించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు.
‘‘మిర్చి ఉత్పత్తి వ్యవయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తే రూ.11,600 వచ్చింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా మిర్చి ఎగుమతులు ఇప్పుడు జరగట్లేదు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా సమావేశంలో చర్చించాం. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతాం. మిర్చి రైతులు ఆదాయాన్ని ఎలా పెంచాలన్నదానిపై అంతా చర్చిస్తున్నాం.
ఉత్పత్తి వ్యవయాన్ని రూ.11,600 కన్నా ఎక్కువగా నిర్ణయించాలని ఐసీఏఆర్(ICAR)ను కోరాం. ఏపీలో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా క్వింటాల్‌కు ఉత్పత్తి వ్యయం జోడించి రూ.12వేల పైచిలుకు ధరను అందించాలని అడిగాం. ఈ విషయంలో ఐసీఏఆర్ అధికారులకు కేంద్రమంత్రి ఆదేశాలిచ్చారు. ఎగుమతుల సమస్యలను పరిష్కరించడానికి ఎగుమతిదారులతో సమావేశం కావాలని నిశ్చయించాం మిర్చి రైతుల విషయంలో వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరాం’’ అని ఆయన(Ram Mohan Naidu) తెలిపారు.