గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. విజయవాడ ప్రతినిధుల కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో నియోజకవర్గంలోని ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వంశీపై కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వంశీ విచారణకు హాజరుకాకపోవడంతో ఇంతకుముందే బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
అయినా కానీ కోర్టుకు రాకపోవడంతో అరెస్ట్ వారెంట్‌ను అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. మరి కోర్టు ఆదేశాలపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో వంశీతో పాటు మొత్తం 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం(Gannavaram) ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. దీంతో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేయనున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వంశీకి టికెట్ రావడం కష్టమని తెలుస్తోంది. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తెకి సీఎం జగన్ టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వంశీ(Vallabhaneni Vamsi) రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.