నూతన మద్యం పాలసీ రూపకల్పన కోసం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఉప సంఘం.. మందుబాబులకు శుభవార్త చెప్పింది. వందల రూపాయలు ఖర్చు పెట్టి నాసిరకం మద్యం కొనే రోజులకు స్వస్తి పలికే సమయం వచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అతి త్వరలోనే నూతన మద్యం పాలసీ తీసుకురానున్నామని, ఒక్కసారి ఈ పాలసీ అమల్లోకి వస్తే ప్రజలందరికీ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ నాణ్యమన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా ఈ నూతన పాలసీ రూపకల్పన జరుగుతోందని చెప్పారు. క్యాబినెట్ ఉపసంఘం తమ అధ్యయనానికి సంబంధించిన నివేదికను సీఎం చంద్రబాబుకు వివరించిందని ఆయన చెప్పారు.
‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో నూతన మద్యం పాలసీపై సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన ప్రపోజల్సుతో ఆరు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ప్రజలు నాణ్యమైన మద్యాన్ని కోరుకుంటున్నారు. సెర్ప్ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో నాసిరకం మందు విక్రయాల ద్వారా ఎంతోమంది అనారోగ్యం పాలే చనిపోయారు. దీంతో వితంతు, ఒంటరి పెన్షన్లు పెరిగాయి. అందుకే రాష్ట్రంలో బెస్ట్ పాలసీని అమలు చేయబోతున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా తక్కువ ధరకే మద్యం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని వెల్లడించారు.