ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వార్ నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి తాము అందిస్తున్న ఇంగ్లీషు మీడియం విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈరోజు తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై చంద్రబాబు(Chandrababu) ఘాటుగా స్పందించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏ విద్యార్థికి అన్యాయం చేయదని అన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. మాతృభాషను నేర్చుకోవడం కూడా అంతే అవసరమని చెప్పారు.
‘‘భాషను మరిచిపోతే జాతి మనుగడే కనుమరుగవుతుంది. కూచిపూడి తెలుగుజాతి వారసత్వ సంపద. కూచిపూడిని కాపాడే బాధ్యతను తీసుకుంటాం. పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలి. ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారు. ఇప్పటికి కూడా వారు ఇలానే మాట్లాడుతున్నారు. భాష అనేకి కమ్యునికేషన్ కోసం మాత్రమే. తెలుగు భాషను మేము తప్పకుండా కాపాడతాం. జీతం కోసం ఆంగ్లం.. జీవితం కోసం తెలుగు భాషను నేర్పిస్తాం. 2047 నాటికి దేశంలనే ఏపీని ప్రథమస్థానంలో ఉంచాలని కృషి చేస్తున్నాం. నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం’’ అని Chandrababu వ్యాఖ్యానించారు.