చంద్రబాబు ఆదేశిస్తే గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీచేయడానికి సిద్ధమని యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkat Rao ) తెలిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనను యార్లగడ్డ కలిశారు. కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీలోకి చేరేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈనెల 22న గన్నవరంలో జరగనున్న లోకేశ్ పాదయాత్ర(Lokesh Padayatra) సభలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు యార్లగడ్డ. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. రాజకీయాల కోసమే అమెరికా వదిలి ఇక్కడకు వచ్చానన్నారు.
అమెరికా నుంచి వచ్చిన తనను జగన్(Jagan) దారుణంగా మోసం చేశారని.. తడిగుడ్డతో గొంతు కోశారని ఆవేదన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ(Yarlagadda Venkat Rao) మాట్లాడుతూ… తాను గడపగడపకూ తిరిగి వైసీపీని పటిష్ఠం చేశానని తెలిపారు. అలాంటి తనను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పార్టీలో ఉండేవాళ్లు ఉండండి.. పోయేవాళ్లు పోండి అనడం బాధించిందన్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో చేరడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు చెప్పారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు(Chandrababu)తో కలిసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.
మొత్తానికి యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారని స్పష్టంచేయడంతో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ(TDP) నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ(YCP) నుంచి.. వైసీపీ నుంచి పోటీచేసిన యార్లగడ్డ టీడీపీ నుంచి పోటీ చేయనుండటం విశేషం. తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా గన్నవరం ఉంది. దీంతో యార్లగడ్డ టీడీపీలోకి వెళ్లనుండటంతో వంశీ అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఈసారి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారట.