ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్(Gottipati Bharath).. తన సోదరి, దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి(Gottipati Lakshmi)కి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
‘గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు మరియు నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణాంతరం నాకు జగనన్న పర్చూరు ఇంఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి, నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోవడం జరిగింది. దాని తరువాత ఐదేళ్ల పోరాటంలో నాతో కలిసి ఎన్నో కేసులు, అవమానాలు పడ్డారు, నా సుఖాల్లో కంటే నా కష్టాల్లోనే నాకు తోడు నీడగా నిలిచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇంఛార్జ్‌ల మార్పులవల్ల వచ్చిన కొత్తవారికి సమన్వయలోపం వల్ల కష్టపడే నాయకులకి అసలైన YSRCP కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను నన్ను క్షమించాలి’.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే, నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడక్కుండా సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్ళినా, నామ మాత్రపు ఫీజు తీసుకుని వైద్యం చేసింది. ఇప్పటివరకు నా అక్క నన్ను ఏమి అడగలేదు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడు అని అడిగింది. నా అక్కకి తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళ్తున్నాను. జగనన్న నన్ను క్షమించండి నాకు మీరు ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించారు, కానీ నా ధర్మం నేను(Gottipati Bharath) నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.