మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Ys Avinash Reddy)కి భారీ ఊరట లభించింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది, జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు దస్తగిరి పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
అలాగే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ల కొట్టేసింది. కాగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి(Ys Avinash Reddy)కి గతేడాది తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.