వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పార్టీ అధినేత్రి షర్మిల(YS Sharmila) జనవరి 4న కాంగ్రెస్ పెద్దల సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. AICC తనకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు YSRTP నేతలతో జరిగిన సమావేశంలో షర్మిల వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ నుండి తమకు ఎలాంటి నష్టం లేదని భావిస్తున్న వైసీపీ నేతలకు.. షర్మిల రూపంలో ముప్పు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు షర్మిల కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరపున బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది.
మరో నాలుగు నెలలు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎలక్షన్స్ పై పూర్తిగా ఫోకస్ పెట్టాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ(YCP)ని ఎలాగైనా ఓడించి తీరాలని టీడీపీ(TDP), జనసేన(Janasena) ఒక్కటయ్యాయి. ఒంటరిగానే ఎన్నికలకు వెళతానని, 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలిచి తీరుతానంటూ వైసీపీ అధినేత జగన్(YS Jagan) శపథం పూనారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాలకు ఇన్చార్జిలను కూడా మారుస్తున్నారు. టికెట్ దక్కదని తెలిసినవారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది టీడీపీ, జనసేన వైపు చూస్తుంటే మరి కొందరు షర్మిల ఎంట్రీ తర్వాత కాంగ్రెస్(Congress) లో చేరేందుకు పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో మరో వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు వెనకే ఉండి జగన్ కి మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చిన భారతి.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారట. కడప(Kadapa) పార్లమెంటు నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట. 1989 నుండి 2019 ఎన్నికల వరకు వైఎస్సార్ కుటుంబసభ్యులకే విజయం వరించింది. జగన్ సొంతగా పార్టీ పెట్టినప్పటి నుంచి కడప పార్లమెంటులో వైసీపీ జెండా ఎగురుతూనే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో కాంగ్రెస్ నుండి షర్మిల, వైసీపీ నుండి అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) నిలబడితే.. వైఎస్సార్ అభిమానులు షర్మిల(YS Sharmila)కే పట్టం కట్టే అవకాశం ఎక్కువ.
ఈ క్రమంలో చెల్లెలికి చెక్ పెట్టేందుకు జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో షర్మిల పై పోటీకి భారతి(YS Bharathi)ని బరిలో దింపనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే భార్య మాటలు విని జగన్ సొంత చెల్లెల్ని వదులుకున్నాడు అని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు బలం చేకూర్చినట్టు అవుతుంది. లేదంటే జగన్ ముద్దుగా పిలుచుకునే షర్మి పాప కోసం ఆ స్థానాన్ని వదులుకుని విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇస్తాడో. ఏదేమైనా జగన్ తాను తీసుకునే నిర్ణయాలు ఎవ్వరికీ అర్ధం కావు. గెలవాలి అనుకుంటే ఎవరేమనుకున్నా నిర్మొహమాటంగా, మొండిగా దూసుకెళ్తారు. అభిమానులు కూడా అందుకే మా జగనన్న మొండోడు అంటుంటారు. మరి కడప పార్లమెంటు పై ఆయన తీసుకున్న నిర్ణయంపై అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.