చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన “మేమంతా సిద్ధం” బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పాలను అందిస్తున్న మీ బిడ్డను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయని తెలిపారు. వారందరినీ అడ్డుకుని తనకు మీరే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
“ఇటు జగన్(YS Jagan) ఒక్కడే… అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ వాళ్లు ఏకమయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కూడా వారికే వత్తాసు పలుకుతోంది. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమేనా? ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు… ఇప్పటివరకు జరిగిన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లకు కూడా కొనసాగించే ఎన్నికలు ఇవి. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ ఎన్నికలు మన పార్టీకి ఓ జైత్రయాత్ర అయితే, మోసాలబాబుకు చివరి ఎన్నికలు కావాలి.
పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే, మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా.? మళ్లీ నారావారి పాలన తెస్తామంటున్నారు. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడుగుతున్నాను. నరకాసురుడు, రావణుడు, ధుర్యోధనుడు కలిశారు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. ఇంట్లో ఉన్న మీ అక్కచెల్లెమ్మలతో, మీ అవ్వా తాతలతో కూర్చుని ఆలోచన చేయండి. మీకు ఎవరి పాలనలో మంచి జరిగిందో, మీ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి” జగన్ వ్యాఖ్యానించారు.