టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ నాయకురాలు వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల.. కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మనవడు రాజా రెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖరరెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారు. ఇద్దరం చాలా సేపు మాట్లాడాం. చాలా సంతోషం అనిపించింది.
పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావించారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, ఉదయం నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు.
లోకేశ్(Lokesh) నా గురించి చేసిన ట్వీట్ రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఆ కేక్ కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి వారికి కూడా పంపించాం. రాజకీయాలే జీవితం కాదు. రాజకీయం ఒక వృత్తి. రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేక్ పంపిస్తే అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంటుంది.
చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడొద్దు. రాజశేఖరరెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును పిలిచారు. చంద్రబాబు కూడా రావడం జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రజల కోసం అందరం నమ్మకంగా పని చేద్దాం. నాకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు” అని షర్మిల(YS Sharmila) చెప్పుకొచ్చారు.
Read Also: అయోధ్య నుంచి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat