ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ(TDP), వైసీపీ(YCP)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై నానా యాగీ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఆ అంశాన్ని పక్కన పెట్టారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఢిల్లీ వేదికగా పోరాటాలకు సిద్ధమయ్యారు షర్మిల. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ(BJP) మాట తప్పిందని.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని నిరసన చేపట్టనున్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రానున్నారు. అలాగే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా ఈ ధర్నాలో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబట్టేందుకు షర్మిల(YS Sharmila) దూకుడుగా వెళ్తున్నారు.