మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Vivekananda Murder Case) రోజుకో మలుపు తిరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఎదురవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా వివేకా కూతరు సునీతారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల(Pulivendula) పోలీసులు తనతో పాటు తన భర్త రాజశేఖర్ రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌తోపాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మీడియాతో సునీతా(YS Sunitha) మాట్లాడుతూ తమను వేధించేందుకే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు.. ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. తాము నేరానికి పాల్పడినట్లు ఎలాంటి కారణాలు చెప్పకుండానే దర్యాప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం చెల్లుబాటు కాదని తెలిపారు.
కాగా వివేకా హత్య కేసు(Vivekananda Murder Case)లో పులివెందులకు చెందిన వ్యక్తుల పేర్లు చెప్పాలని సీబీఐ(CBI) దర్యాప్తు అధికారి రాంసింగ్, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు తనను బెదిరించారని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పులివెందుల కోర్టు.. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదుచేయడమే కాకుండా ఛార్జిషీటు కూడా దాఖలు చేశారు.