బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్పకాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.రెండు కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది.
కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.రెండు కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. ఇవి నేటి (జనవరి 15, 2022) నుంచే అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే కేటగిరీలోని సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేటును 5.5 శాతం నుంచి 5.6 శాతానికి పెంచారు.
గత ఏడాది డిసెంబరులోనే బేస్ రేటును ఎస్‌బీఐ 0.10 శాతం పెంచడం వల్ల అది సంవత్సరానికి 7.55 శాతానికి చేరింది. డిసెంబరు 15, 2021 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తక్కువ వడ్డీరేట్లకు ఇక సమయం ముగిసిందనడానికి ఇది సంకేతం అని బ్యాంకింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోన్లు ఇచ్చేందుకు బేస్ రేట్‌ను ఆధారంగా తీసుకుంటారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్ల ట్రెండ్‌ను కూడా ఇది సూచిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బేస్ రేటు పెరగడం వల్ల త్వరలో మరిన్ని వడ్డీరేట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయి. దీంతో ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసినవారు చాలా తక్కువ రాబడి పొందుతున్నారు.
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సైతం ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచి వర్తిస్తాయి. తాజా వడ్డీ రేట్ల ప్రకారం, 7 నుంచి 14 రోజుల వరకు 2.50%, 15- 29 రోజుల వరకు 2.50%, 30 నుంచి 90 రోజుల వరకు 3%, 91 రోజుల నుంచి 6 నెలల వరకు 3.5%, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.4%, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5%, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 5.20%, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.40%, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.60% వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేటును పెంచింది. ఈ తాజా వడ్డీ రేట్లు జనవరి 6 నుంచి వర్తిస్తాయి. కోటక్ మహీంద్రా వెబ్సైట్ ప్రకారం, 7 నుంచి 30 రోజుల వరకు 2.50%, 31 రోజుల నుంచి 90 రోజుల వరకు 2.75%, 91 నుంచి 120 రోజుల వరకు 3%, 121 రోజుల నుంచి 179 రోజుల వరకు 3.25%, 180-269 రోజుల వరకు 4. 40%, 271- 363 రోజుల వరకు 4.40%, 365- 389 రోజుల వరకు 4.9%, 390- 391 రోజుల వరకు 5%, 392 రోజుల నుంచి రెండేళ్ల వరకు 5.10%, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు 5.15%, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.3% వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది.