ప్రఖ్యాత సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఇకపై కొత్త ఉద్యోగాలు ఉండబోవని, ఫ్రెషర్స్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో మిగిలిన ఆరు నెలలతో పాటు వచ్చే సంవత్సరంలో తమ సంస్థలోకి కొత్త ఉద్యోగులను తీసుకోదలచుకోలేదని ప్రకటన జారీ చేసింది.
కొత్త ఉద్యోగాలేవైనా తీసుకోవాల్సి ఉంటే.. ఐటీకి బదులుగా ఇంజినీరింగ్, టెక్నికల్ ఇతర స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సంస్థలో ప్రస్తుతం పని చేస్తోన్న ఉద్యోగులకు ఓ మెమొరాండం పంపించారు. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, వాట్సప్ మాతృసంస్థ మెటా కూడా ఇదివరకే ఇదే తరహా ప్రకటన వెలువడించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
సంస్థలో ఉద్యోగాల నియామకాలను నియంత్రిస్తామంటూ మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో గూగుల్ కూడా నడిచింది. ప్రధాన వనరుల ద్వారా అందుతోన్న ఆదాయ వనరులు మందగించిందని, ఇదివరకట్లా క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఉండట్లేదనే వాదనలు ఉన్నాయి. ఫలితంగా ఖర్చును కుదించుకోవడంపై గూగుల్ యాజమాన్యం దృష్టి సారించిందని అంటున్నారు.