ఇప్పటికే పెరిగిన మొబైల్ రీచార్జి ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయా? 5G సేవలే ఇందుకు కారణమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్) గత సంవత్సరంలో డేటా ఛార్జీలను పెంచాయి. అయితే VIL తన తాజా వార్షిక నివేదికలో ఇప్పటికీ తక్కువ టారిఫ్‌లు ఉన్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీలు అందిస్తున్న అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ల కారణంగా ప్రపంచంలో అత్యధిక డేటా వినియోగాన్ని కలిగి ఉన్న దేశాలలో భారతదేశం తొలి స్థానాల్లో ఉండగా, అత్యల్ప టారిఫ్‌లు కలిగిన దేశంగానూ భారత్ టాప్‌లో ఉందని కంపెనీ పేర్కొంది.
మరోవైపు దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం 5Gని తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద అడ్వాన్స్‌లు కూడా జమ చేశాయి. 5G నెట్‌వర్క్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. అదే సమయంలో 5G నెట్‌వర్క్ కోసం వినియోగదారులు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనేది ప్రశ్నగా మారింది. టెలికాం రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టెల్కోలు మొదట్లో 5G ధరను కొంచెం ఎక్కువగానే నిర్ణయించే అవకాశం ఉంది. 4G సేవల కంటే 5G ప్లాన్‌లు 10 నుండి 20 శాతం ఎక్కువ ఖర్చు అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే సామాన్యులకు మరో భారం నెత్తిపై పడనుంది.