రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణించటం, ద్రవ్యోల్బణం పెరగటం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా డాలర్‌తో మన కరెన్సీ మారకం 82 రూపాయలకు చేరువయ్యింది. దీంతో విదేశాల్లోని చదువుతున్న భారతీయ విద్యార్థులపై మరింత భారం పడనుంది. చదువుల కోసం దాచిన డబ్బుతో పాటు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విదేశాల్లోని పైచదువులు అభ్యసించే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రూపాయి మారకం విలువ తగ్గటం పెను భారంగా మారింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఉంటున్న విద్యార్థులకు జీవనం, ఫీజులు డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండగా, అదనంగా సంవత్సరానికి ఒక్కో విద్యార్థిపై రూ.4 నుంచి రూ.5 లక్షల భారం పడుతోంది. విదేశీ ప్రయాణాల ధరలు సైతం పెరిగిపోవటంతో, అత్యవసర సమయాల్లో దేశానికి తిరిగి రావటం కూడా గగనం అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు.