రోజురోజుకు సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుంది. నిమిషాల్లో మనం ఇంటర్ నెట్ ను ఉపయోగించి మన పనులు చేసుకుంటున్నాం. నిమిషాల్లో సినిమా డౌన్లోడ్ ఇది ప్రస్తుతం నెట్ వేగం. రాను రాను ఇది సెకన్లు కావొచ్చు. ఇప్పటివరకు దేశంలో 4G సేవలు మాత్రమే ఉండగా తాజాగా 5G సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు కూడా ఎప్పుడెప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి అని ఎదురుచూస్తున్నారు.
గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో పలు ప్రధాన నగరాల్లో ప్రారంభమై ఆ తర్వాత చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. దేశంలో మొదట ఈ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర పట్టణాల్లో విస్తరించనున్నాయి.
ఇక ఇందుకు అనుగుణంగా దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరుకల్లా 5జీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో దేశంలో ఏ క్షణమైనా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్ చేస్తున్నాయి.