కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన సీట్ల పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంగళవారం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అక్టోబర్ 18 నుంచి..ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కొవిడ్ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని విమానయాన సంస్థలకు నిర్దేశించింది.
గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించింది కేంద్రం. లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా..సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1న ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించింది.
అనంతరం ఆగస్టు 12 నాటికి ఆక్యుపెన్సీని 72.5 శాతానికి పెంచింది. సెప్టెంబర్లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్ కేసులు కనిష్ఠ స్థాయికి చేరుతున్న క్రమంలో..సీటింగ్ సామర్థ్యంపై పూర్తి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.