శంషాబాద్ పరిధిలో ఓ మహిళను ప్రియుడే హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సరూర్ నగర్‌కు చెందిన సాయికృష్ణ అనే పూజారి దగ్గిర బంధువైన అప్సర అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నిరోజులుగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ అప్సర పూజారిపై ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే సాయికృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. దీంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.
అప్సరను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోనే ఓ మ్యాన్ హోల్‌లో పడేశాడు. అనంతరం ఏమి ఎరగనట్లు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, పూజారి కాల్ లిస్ట్ పరిశీలించడంతో అసలు సంగతి బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. కాగా ఈ నెల 3వ తేదీనే హత్య చేసినట్లు గుర్తించారు.