Bandla Ganesh Driver | ఒక్కోసారి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను తలకిందులు చేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. చట్నీ విషయంలో భార్యాభర్తల మొదలైన వివాదం ఆ కుటుంబాన్ని నాశనం చేసింది.
కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోపతండాకు చెందిన రమణ(Ramana).. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(Chandana)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రమణ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చందన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. వీరు బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో పచ్చడి ఎక్కువ వేశావంటూ భార్య చందనతో రమణ గొడవపడ్డాడు. అనంతరం విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియెకాల్స్ చేసింది. అయితే అతడు ఎత్తకపోవడంతో మామూలు ఫోన్ చేసి కావాలనే తనతో గొడవపడుతున్నావ్.. చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేంది. దీంతో టెన్షన్ పడిన రమణ.. ఇంటి యజమానికి సమాచారం అందించాడు. యజమాని ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా..అప్పటికే ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది.