కోవిడ్ తర్వాత బ్లాక్ ఫంగస్, 15 మంది కళ్లు పోగొట్టుకున్నారు- అసలేం జరిగిందంటే

Black fungus after covid lost 15 members eyes

0
41

కరోనా వచ్చి తగ్గిపోయిందని హాయిగా ఉండొచ్చు అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ రూపంలో కంటి సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందినవారు, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడిన వారికి కంటి సంబంధ సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ కారణంగా 15 మంది కండ్లు పోగొట్టుకున్నట్లు సరోజినిదేవి కంటి ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్ స్టార్టయినప్పటి నుంచి ఇప్పటి వరకు సరోజినిదేవి కంటిఆసుపత్రిలో 584 మంది రోగులకు డాక్టర్లు చికిత్స చేశారు. ప్రస్తుతం 70 మంది వరకు ట్రీట్ మెంట్ నడుస్తున్నది. వీరిలో ఇప్పటికే కంటిలో తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో 15 మందికి ఒక కన్ను తీసేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అయితే మరో 20 మంది వరకు పాక్షికంగా కంటిచూపును కాపాడగలిగారు డాక్టర్లు.

మొత్తం కేసులతో పోలిస్తే ఇలాంటి కేసులు 5శాతమే అయినప్పటికీ నేత్రాలను కోల్పోవడం బాధాకరమని డాక్టర్లు అంటున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలపై చాలామందికి అవగాహన లేకపోవడం వల్లే వారు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తున్నట్లు గురించామన్నారు. బ్లాక్ ఫంగస్ ను గుర్తించడంలో ఆలస్యం జరిగితే కంటి నుంచి మెదడుకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ వచ్చిన సమయంలో ఆసుపత్రిలో చేరడం, ఆక్సిజన్ పరికరంతో శ్వాస పీల్చుకోవడం, ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడకం చేసిన వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడుతున్నాయని అలాంటి వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని కంటి డాక్టర్లు సూచిస్తున్నారు.

సరోజిని దేవి కంటి ఆసుపత్రికి వచ్చే బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య ఇప్పుడు తగ్గుముఖం ప్టిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం మీడియాకు తెలిపారు. వారం క్రితం నిత్యం 40 నుంచి 50 కేసులు వచ్చేవని కానీ ఇప్పుడు 15 కేసులు కూడా రావడంలేదని చెప్పారు. మరో నెల రోజుల వరకు ఈ సమస్య కొనసాగే అవకాశం ఉందన్నారు. మనిషికి వచ్చిన రోగ తీవ్రతను బట్టి మూడు నెలల పాటు చికిత్స అవసరం అవుతుందన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్ ఫంగస్ కు సంబంధించి ఏ ఒక్క లక్షణం కనిపించినా నిర్లక్షయం చేయరాదని సూచించారు.