తెలంగాణ: పెట్టిన పెట్టుబడికి అధిక డబ్బు వస్తుందని ఆశ చూపించి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘరానా భార్యాభర్తలు కట్ల రమేష్, అతని భార్య రమాదేవి ఇద్దరిని పిడి యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు.
మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు, తెలిసిన వ్యక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే అధిక డబ్బులు, లాభాలు పొందవచ్చని నమ్మించి చాలా మందిని మోసం చేసారని తెలిపారు. ఇండియన్ గెలాక్సీ పేరుతో సాగించిన ఈ దందాలో వీరిద్దరూ కలిసి 76 మంది నుండి నాలుగు కోట్ల రూపాయలకు మోసం చేసారని తెలిపారు.
బాధితులకు చెప్పిన ప్రకారం డబ్బులు చెల్లించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ, తీసుకున్న. సొమ్ము సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పలువురు బాధితులు తమను ఆశ్రయించినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో పాటు రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. బెయిలుపై విడుదల కావడంతో వారిని మరోసారి అదుపులోకి తీసుకొని, జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ వెబ్కటేశ్వర్ రావు పర్యవేక్షణలో పి.డి. యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించామని నిగిడాల సురేష్ వివరించారు.
ప్రజలు అధిక వడ్డీలకు, స్వల్ప కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిగిడాల సురేష్ ప్రజలకు సూచించారు.