లండన్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి(Tejaswini Reddy) ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. బ్రెజిల్(Brazil) దేశానికి చెందిన యువకుడు తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు యువతులపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని అక్కడికక్కడే మృతిచెందగా.. అఖిల తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు యువతులు బ్రెజిల్ యువకుడితో పాటు మరికొంతమంది స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు వారిపై దాడి చేశాడు. నిందితుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితమే తేజస్విని(Tejaswini Reddy) ఎంఎస్ పూర్తిచేసింది. త్వరలోనే ఆమె హైదరాబాద్ రావాల్సి ఉండగా ఈలోపే ఇలా హత్యకు గురికావడంతో యువతి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.