వాళ్లు నలుగురు యువకులు అత్యంత కిరాతకమైన పనికి పూనుకున్నారు. మాంసం కోసం పదునైన కత్తులతో పాలిచ్చే బర్ల తొడలు కోసుకెళ్లారు. రక్తం వరదలా కారి ఆ మూగజీవాలు చనిపోయాయి. అత్యంత క్రూరమైన ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కొండపాక మండలంలోని సిరిసినగండ్ల గ్రామ శివార్లలో జరిగింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇవీ…
సిరిసినగండ్ల, దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్ రెడ్డి అనే రైతుకు వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో నేపాల్ కు చెందిన ఒక యువకుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం పక్కన రాజగిరి వెంకటేశం అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలంలోని కొట్టంలో ఉన్న తన బర్ల నుంచి పాలు పిండుకుని, మేత వేసి ఇంటికి వెళ్లిపోయాడు.
రాజేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు యువకులు రాతరివేళ మాంసం కోసం ఆ కొట్టం వద్దకు వెళ్లి రెండు గేదెల తొడ భాగాలను కోసుకుని తీసుకుపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆ బర్లు చనిపోయాయి. శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూసిన రైతు వెంకటేశం షాక్ కు గురయ్యాడు.
గ్రామస్థులతో కలిసి గాలించగా వ్యవసాయ క్షేత్రంలో ఆ గేదెల మాంసాన్ని వందేందుకు సిద్ధం చేసుకుంటూ ఈ నలుగురు యువకులు కనబడ్డారు. గ్రామస్థులను చూసి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు పారిపోయారు. నేపాలీ యువకుడు సందీప్ పట్టుబడ్డాడు. అతడిని నిలదీయడంతో అసలు విషయం వెల్లడించాడు.
సిద్దిపేట త్రి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై కొమురయ్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.