తెలంగాణ: పొలంలో వరి కొయ్యలను కాలుస్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ రైతు మరణించాడు. ఈ విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (65) రెండెకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలే పంట కోశాడు.
బుధవారం ఉదయం 11 గంటలకు పొలంలో కొయ్యకాళ్లను కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గడ్డికుప్పలు అంటుకుంటాయనే ఆందోళనతో ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకొని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అతని మృతితో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది.