మేడారం(Medaram) మహా జాతర ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. జాతరకి ఇంకా 16 రోజులు గడువుంది. కానీ ఇప్పటికే గద్దెలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నేడు ఆదివారం సెలవు కావడంతో జనం భారీగా పోటెత్తారు. ఇవాళ ఒక్కరోజే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకునేందుకు రెండు లక్షల మంది పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
మహా జాతర సమయంలో జన సందోహం ఎక్కువగా ఉండొచ్చని ముందుగానే కొంతమంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు. సమ్మక్క సారలమ్మ లకు భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిలువెత్తు బంగారాన్ని సంపర్పించి చల్లగా కాపాడమని వనదేవతలను వేడుకుంటున్నారు. కాగా, మహా జాతర(Medaram)కు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గద్దెల ప్రాంగణంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నారు.