Puja Tips |దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిరనివాసం చేస్తుందని, దీపంలేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మిస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చెయ్యరు. దీపం సకల దేవతా స్వరూపం. దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి బిందువు. వత్తినుంచి వచ్చే అగ్ని శక్తి, ఆ అగ్ని తాలూకు వెలుగు సరస్వతీ, విస్ఫులింగం లక్ష్మీ దేవి.
దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టి కుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద చిన్న పళ్లెం పెట్టాలి. మట్టిప్రమిద అయితే కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.
Puja Tips | దీపారాధన ఎలా చెయ్యాలి..?
దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి వుంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని ఒక పద్దతిగా, నిష్టగా వెలిగించాలి. అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా దీపారాధన చేయాలి.
ఐదువత్తులు – దీపారాధన కుందిలో అయిదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవ, ధర్మవృద్ధులకూ, అయిదోది వంశాకభివృద్ధికి అని చెప్తారు..
దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పని సరిగా వుండాలి. దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదు.
ఏ నూనె మంచిది?
ఓ పక్క ఆవునేతితో, మరోపక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వేపనూనెలో రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది.
కొబ్బరి నూనెతో దీపారాధన అర్థనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వులనూనెను సకలదేవతలూ ఇష్టపడతారు. దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలూ ఇవ్వగలదు. నువ్వులనూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం.
ముఖ్య గమనిక: వేరు శెనగనూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
Read Also: వేసవిలో సింపుల్ స్కిన్ కేర్ టిప్స్
Follow us on: Google News, Koo, Twitter