Chandrayaan 3 | చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. జాబిల్లికి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. మరో 4 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. ల్యాండర్ డీ బూస్టింగ్ ప్రక్రియతో పాటు ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లకు ఈ నాలుగు రోజులు చాలా కీలకం. ఈ ప్రయాణంలో చంద్రయాన్ ఎన్నో క్లిష్టమైన సవాళ్లను దాటి అత్యంత చేరువలోకొచ్చేసింది. చంద్రునిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు సిద్ధమైంది. ప్రతి క్లిష్టమైన ప్రక్రియను దాటుకుంటూ చంద్రునికి అతి సమీపంలోకి చేరువైంది. శుక్రవారం ఈ మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ డీ బూస్టింగ్ ప్రక్రియ సక్సెసైంది.
అయితే ఇవాళ మరోసారి డీ బూస్టింగ్ ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత చంద్రునికి 30కిలోమీటర్ల దూరంలోకి చేరుతుంది విక్రమ్ ల్యాండర్. అక్కడి నుంచి విక్రమ్ చంద్రునిపై ఫైనల్ ల్యాండింగ్ కు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఆగస్ట్ 23న చంద్రుని ఉపరితలంపై దిగుతుందని తెలిపారు. అయితే దానికి ముందు ల్యాండర్ వేగం సెకనుకు 2 కిలోమీటర్ల నుంచి సున్నాకు తగ్గిస్తారు. అది చాలా సంక్లిష్టమైన, కీలకమైన ప్రక్రియగా చెబుతున్నారు. 23న సాయంత్రం 5.30గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ తన మిషన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సూర్యుని కాంతి, శక్తిని ఉపయోగిస్తుంది.
Chandrayaan 3 | ఈ మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ 14రోజుల పాటు తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రెండు రోవర్లు విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తాయి. ప్రస్తుతం చంద్రునిపై రాత్రి కాగా.. 23న సూర్యోదయం ఉంటుంది. తాజాగా విక్రమ్ ల్యాండర్ తీసిన చిత్రాలను ఇస్రో(ISRO) తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.