నిమ్మరసంతో అద్భుత ప్రయోజనాలు..అవేంటో తెలుసా?

0
106

చిన్న చిన్న అలవాట్లే కానీ మన శరీరంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. చూడటానికి తేలికగానే అనిపించొచ్చు. కొందరు అసలే పట్టించుకోకపోనూవచ్చు. అలాంటిదే నిమ్మరసం నీరు. మనకు నిమ్మకాయలు ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోము. ఉదయం పూట నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం..

మనలో చాలా మంది ఎక్కువ నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుందట.

నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది.

నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది.