కోవాగ్జిన్ టీకాలో ‘‘ఆవు దూడ రక్తం’’ పై కేంద్రం క్లారిటీ

Central Government Clarity on "cow calf blood" in covaxin vaccine

0
117

ఇండియాలో తయారైతున్న కోవాగ్జిన్ టీకాలో ఆవు దూడ రక్తపు రసి ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన వెలువరించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రకటనలో తెలిపిన వివరాలు ఇవీ…

అప్పుడే పుట్టిన ఆవుదూడ రక్తపు రసిని వెరో సెల్స్ తయారీ, అభివృద్ధి కోసం మాత్రమే వాడతారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్నిచోట్లా జరిగేదే. ఆవులు లేదా ఇతర జంతువుల దూడల నుంచి సేకరించి జీవ కణాలను వృద్ధి చేయడానికి ప్రామాణిక విధానం ఉంది.

వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒకేరకమైన జీవ కణాలను సిద్ధం చేయడానికి వెరో సెల్స్ ను వాడతారు. పోలియో, రేబిస్, ఇన్ ఫ్లూయెంజా వంటి వాటికి టీకాలను తయారు చేయడంలో ఈ పద్ధతిని గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇవి వృద్ధి చెందిన తర్వాత వెరో సెల్స్ ను నీటితో, పలు రకాల రసాయనాలతో అనేకసార్లు శుభ్రపరుస్తారు. దూడ రక్తపు రసి ఏమాత్రం మిగలకుండా అలా చేస్తారు. ఆ తర్వాత వాటికి వైరస్ ఇన్ఫెక్షన్ సోకేలా చేస్తారు. వైరస్ సంబంధిత వృద్ధి ప్రక్రియలో వెరో సెల్స్ ను పూర్తిగా నాశనం చేస్తారు. ఆ తర్వాత వృద్ధి చెందిన వైరస్ ను నిర్వీర్యం చేసి శుద్ధి చేస్తారు. తుది వ్యాక్సిన్ తయారీలో దీన్ని వాడతారు. ఈ తయారీలో దూర రక్తపు రసి ని వాడడమనేదే జరగదు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో ఇది ఉండే అవకాశమే లేదు. దానిలో ఇది భాగమే కాదు… అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.