ఆనందయ్య ముందుపై చిన్న జీయర్ స్వామి స్పందన : ఎపి సర్కారుకు సూచన

0
97

కరోనా రోగులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుపై పలువురు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. అయితే ఆనందయ్య ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా మందు పంపిణీ చేయడం, 80వేల మందికి మందు ఇస్తే పెద్దగా రిమార్క్స్ లేకపోవడం లాంటి ఘటనల వల్ల ఆయన మందుకు ఎక్కువమంది నుంచి మద్దతు లభిస్తోంది. కొందరు మాత్రమే ఆయన మందును వ్యతిరేకిస్తూ హేళన చేస్తున్నారు.

తాజాగా ఆనందయ్య మందుపై చిన్న జియర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందులో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఆయుష్ కమిటీ నిర్ధారించిందని చెప్పారు. ఆనందయ్య ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. ఆనందయ్య ఔషధం ప్రజల ప్రాణాలను నిలబెడుతుందంటే వివాదం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. సంక్షోభ సమయంలో అనవసర వివాదాలు చేయడం తగదని సూచించారు. ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పరిశీలించి తగిన నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని సూచించారు.

ఆదివారం మధ్యాహ్నం చిన్నజియర్ స్వామి ఎర్రగడ్డలోని ఇఎస్ఐ దవాఖానాను సందర్శించారు. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లతో మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.