ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ : కరోనా కట్టడి లాక్ డౌన్, ఉద్యోగ నియామకాలపై చర్చ ?

0
44

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు లాక్ డౌన్ నేటితో ముగియనున్న తరుణంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ కంటిన్యూ చేస్తూ కొద్దివరకు మినహాయింపులు ఇచ్చే అవకాశముందని ఇప్పటికే సమాచారం అందుతోంది.

మరో వారం రోజులు లేదంటే పది రోజులపాటు లాక్ డౌన్ కొనసాగిస్తారని అంటున్నారు. అయితే లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉదయం 6నుంచి 10 వరకు ఇప్పుడు ఉండగా దాన్ని 6 నుంచి 12 గంటల వరకు పొడిగించే చాన్స్ ఉందంటున్నారు. మిగతావన్నీ ఇప్పుడున్న పద్ధతుల్లోనే సాగుతుందంటున్నారు. వారం లేదంటే పదిరోజులు లాక్ డౌన్ కంటిన్యూ చేసిన తర్వాత గతంలో పెట్టినట్లు నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచనలో సిఎం కేసిఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కరోనా కట్టడి, బ్లాక్ పంగస్ విస్తరణపై కేబినెట్ లో చర్చించనున్నారు. బ్లాక్ ఫంగస్ కట్టడి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికను చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

మరో కీలకమైన ఉద్యోగాల నియామకాలపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటిపారుదల శాఖలో ఒక్క ఖాళీ కూడా ఉండొద్దని సిఎం కేసిఆర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. దానికితోడు 50 వేలు ఉద్యోగాలు నియమించాలన్న కసరత్తు గతకొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ లో దీనిపైనా చర్చ జరిపి కరోనా పరిస్థితులు సద్దుమణిగేలోగా నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

అయితే హైకోర్టు తీవ్రమైన వత్తిడి చేసిన నేపథ్యంలో ఇటీవల టిఎస్పీఎస్సీ సభ్యులు, ఛైర్మన్ నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. మరి ఉద్యోగాల కోసం ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగుల్లో సర్కారు పట్ల తీవ్రమైన అసంతృస్తి ఉన్న విషయాన్ని సర్కారు గుర్తించినట్లు టాక్ ఉంది.