చిన్న జీయర్ స్వామి ఇటీవల చేసిన ప్రవచనాలు వివాదాస్పదమయ్యాయి. కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనే చేయాలని, మాంసాహారులు ఏమి మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే వ్యవహరిస్తారని ఆయన చెబుతున్న మాటలు మధ్యయుగాలను గుర్తు చేస్తుంది. ఇవి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.
చిన్న జీయర్ స్వామి వేదశాస్త్రాలతోపాటు భౌతిక రసాయన శాస్త్రాలు అధ్యయనం చేశారు. అలాంటి వ్యక్తి మధ్యయుగాల నాటి అంధ విశ్వాసాల స్థాపనకు సన్నద్ధం కావడం అవివేకమైన చర్య. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విగ్రహానికి సంకుచిత భావాలతో “సమానత్వ ప్రతిమ” పేరు పెట్టడం విడ్డూరం.
సంకుచితమైన ప్రాచీన సమాజ విధానం పోరాడుతూ కూలిపోతుంది. ప్రభువులు- దాసులు అనే విధానం శిధిలమయ్యింది. మానవ ప్రస్థానం ముందుకు సాగుతుంది. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, విజ్ఞానుల కృషి ఫలితంగా సమాజం సత్యానికి చేరువగా వచ్చింది. ఇలాంటి స్థితిలో చిన్న జీయర్ స్వామి ప్రవచనాలు బహుజనుల మనోభావాలను కించపరచడమే. సమాజ పురోగతిని వ్యతిరేకించే ఇలాంటి వ్యక్తి తలపెట్టిన కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి హాజరు కావడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.