రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత మొదటిసారిగా ఒక్కరోజులో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రికార్డు స్థాయిలో 33,208 కొత్త కేసులు రాగా, 1002 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.
కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఇది వరుసగా మూడో రోజు. మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు 80 లక్షల కేసులు నమోదు కాగా.. 2,22,315 మరణాలు సంభవించాయి. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో ఉండగా రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.