ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తే చాలా డేంజర్ : నీతి అయోగ్ సభ్యులు వికే పాల్

0
119

దేశంలో కోవిడ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా స్కూళ్లను ఓపెన్ చేయడం మంచిదికాదని నీతి అయోగ్ సభ్యుడు వి.కే.పాల్ హెచ్చరించారు. స్కూల్ అనగానే కేవలం విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదన్నారు. స్టూడెంట్స్ తో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారని, వారి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉతమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్స్ తెరిచేందుకు ముందుకు రావాలన్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించినప్పుడో, వైరస్ చాలా వరకు తగ్గిపోయినప్పుడు మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేయడం సమంజసమని వివరించారు.

ఇదివరకు పాఠశాలలు తెరిచినప్పుడు వైరస్ విజృంభించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైరస్ తగ్గినట్లు కనిపించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారని, ప్రజలు క్రమశిక్షణతో ఉన్నారని చెప్పారు. అందుకే వైరస్ కంట్రోల్ లో ఉందన్నారు. అయితే తాజాగా ఎక్కువ రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు బడులు కూడా మొదలుపెడితే వైరస్ కు మళ్లీ చాన్స్ ఇచ్చినట్లవుతుందన్నారు.

ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉందన్నారు. రెండు మూడు మంత్రిత్వ శాఖలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతలో ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశం ఉండదు అని చెప్పారు. వ్యాక్సినేషన్ పెరుగుతున్న కొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకు అందరూ కట్టుదిట్టమైన నిబంధనలు పాటించాలని కోరారు. మరో ఐదారు నెలలు ప్రజలు, ప్రభుత్వాలు కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుందన్నారు.